Monday, November 12, 2007

బామ్మ తెలివి


ఒక వైద్యునిగా నిత్యం అనేకమంది రోగులను,వాళ్ళ తరపు బంధువులను జాగ్రత్తగా డీల్ చేసే నేను,ఒక పల్లెటూరి బామ్మ తెలివికి నవ్వాలో ఏడవాలో తెలియని సంకటస్థితిలో పడ్డాను.



సుబ్బమ్మ మనవరాలు తొమ్మిది సంవత్సరాల అరుణ రూపాయి బిళ్ళ మింగింది. గొంతుకు అడ్డంపడి మింగలేక కక్కలేక సతమతమౌతుంటే తీసుకొచ్చారు.అవసరమైన పరీక్షలు చేసి,ఆపరేషన్ ధియేటర్ లోకి తీసు కెళ్ళి జాగ్రత్తగా రూపాయిబిళ్ళని బయటకు తీశాను.ఆ సాయంత్రం మత్తు దిగిందీ లేనిదీ పరీక్షీంచి ఇక ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పి,రూంలో కూర్చున్నాను. ఇంతలో బయట సుబ్బమ్మ ఫీజుచెల్లించే విషయంలో పెద్ద పెద్దగా అరుస్తూ కాంపౌండరుతో గొడవపడ్తూంటే లోనికి పిలిచి, ఏంటి విషయమని అడిగాను.



"డాట్రుగారూ! పోయిన్నెల్లో మా వూళ్ళో వెంకాయమ్మ మనవడు ఐదు రూపాయల బిళ్ళ మింగితే మీరే తీసి రెండు వేల రూపాయలు తీస్కున్నారు....మా పిల్ల మింగింది రూపాయిబిళ్ళేగా....లెక్కజూసి నాలుగొందలిస్తుంటే ఆయబ్బాయి తీసుకోడం లేదు.నువ్వైనా చెప్పయ్యా..."



"! ? ! ? !"






Friday, November 9, 2007

గుర్తుకొస్తున్నాయి...

నా చిన్నతనంలో దీపావళి హడావుడి ఓ నెల ముందునుంచే మొదలయ్యేది.సావాసగాళ్ళంతా కలసి ఎవరెవరు ఏవేం మందుగుండు సామాను తయారుచెయ్యాలో వాటాలు వేసుకునేవాళ్ళం.ముడిసామాను సేకరణ భలే సాహసోపేతంగా వుండేది.తాటిచెట్టెక్కి అదీ మగది మొవ్వలో గిలకల్ని తీసి,బాగా ఎండబెట్టి కాల్చితే బొగ్గు తయారవుతుంది.పల్లెటూరి దీపావళి సామానంతటికి అదే ముడి సరుకు.సూరేకారం,బొగ్గుపొడి కలిపి పల్చటి గుడ్డముక్కలో కట్టి పొట్లంగా చుట్టేవాళ్ళం.ఒక తాటిమట్టను సగంవరకూ బద్దలుగా చీల్చి ఆ పొట్లం పెట్టి తాటిమట్ట చివర తాడుతో కడితే 'పూల పొట్లం' తయారు.ఇక ఎప్పుడెప్పుడు చీకటిపడుతుందాని ఆత్రంగా ఎదురుచూసేవాళ్ళం.పూలపొట్లానికి నిప్పుబెట్టి తాటిమట్టకు ఒక చివర్న తాడుగట్టి గిరగిరా తిప్పుతుంటే..చీకటిలో నిప్పురవ్వలు వలయాకారంలో పువ్వుల్లా జారుతూంటే..పందాలు,కేరింతలూ,తుళ్ళింతలతో ఓ రోజు గడుస్తుంది.ఇంకో రోజు బొగ్గుపొడి,సూరేకారం కలిపి చిన్నచిన్న కాగితపుగొట్టాల్లో కూరి 'జిల్లీ'లు చేసే వాళ్ళం.వాటిని వెలిగించి ఒకరిపై ఒకరు విసురుకుని బట్టలకు కన్నాలు,వంటికి గాయాలు ఇక బోనస్ గా ఇంట్లో తన్నులు తినే వాళ్ళం.
బొగ్గుపొడి,గంధకం,సూరేకారం,సిగరెట్టుపెట్టెల్లో తగరం,ఆముదం కలిపి ఎండబెట్టి కాగితపు గొట్టాల్లో కూర్చి కాకరపువ్వొత్తులు చేసేవాళ్ళం.అట్లకాడను ఒకవైపు దూర్చి(పట్టుకోడానికి) రెండోవైపు వెలిగిస్తే పొగకు దోమలు పరార్..తుమ్ములు,దగ్గులూ తయార్. అప్పట్లో మా ఇంట్లోవున్న ఓ పుస్తకంలో దీపావళి మందుసామాను ఎలా చెయ్యాలో,ఏ ఏ పాళ్ళలో ఏమేమి కలపాలో వివరంగా వుండేది.అది దగ్గరపెట్టుకుని మా వర్క్ షాపు నడిపే వాళ్ళం.ఆ పుస్తకం ఎలా పోయిందో,ఎక్కడ పోయిందో తెలియదుగాని మళ్ళీ కనపడలేదు,కొందామన్నా మళ్ళీ దొరకలేదు.
ఇక తాటాకు టపాకాయలూ,చిచ్చుబుడ్లూ,నేల టపాకాయలూ,అవ్వాయ్ సువ్వాయ్ లు(తారాజువ్వలు)వూళ్ళో అమ్మకానికొస్తాయి.ఇంట్లో పోరి,పోరి కొనిపించుకుని వాటాలదగ్గర తన్నుకుని,పగలంతా కాపలా కాసి, ఎండబెట్టుకుంటే రాత్రయ్యేసరికి ఓ వానజల్లు పడి,పిల్లల వుత్సాహంమీద నీళ్ళు చిలకరించేది.లక్ష్మీ ఔట్లు,ఎర్రకోట సీమటపాకాయలూ కాలిస్తేనే మగోడి కింద లెక్క.దీపావళి రోజున గోగుపుల్లలతో దివిటీలు కాల్చి,రావణాసురుడి దిష్టిబొమ్మలో టపాసులుంచి,వూరేగించి తగులబెట్టడంతో క్లైమాక్స్.